
- హిందీ టీచర్ వేధింపులు భరించలేకేనని చెప్పిన విద్యార్థిని
- స్కూల్ ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్‌లో ఓ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హిందీ టీచర్ వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో శుక్రవారం తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. ఖమ్మం పట్టణానికి కేశబోయిన మహేందర్ అరుణ దంపతుల కూతురు గాయత్రి ముస్తఫానగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌కు వచ్చిన గాయత్రి మధ్యాహ్నం స్కూల్‌లోనే నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న గాయత్రిని గమనించిన స్కూల్ మేనేజ్‌మెంట్ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ట్రీట్‌మెంట్ అనంతరం శుక్రవారం గాయత్రి స్పృహలోకి రావడంతో ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏంటని అడిగారు.
స్కూల్‌లో పనిచేస్తున్న హిందీ టీచర్ సాజిదా బేగం అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానిస్తోందని, అవి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. దీంతో గాయత్రి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. వీరికి పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. టీచర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి నచ్చజెప్పారు. స్టూడెంట్ ఆరోగ్యం మెరుగుపడే వరకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని స్కూల్ మేనేజ్‌మెంట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.