గోడ కుర్చీ వేయించిన టీచర్ .. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

గోడ కుర్చీ వేయించిన టీచర్ .. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • పరిస్థితి విషమం

గచ్చిబౌలి, వెలుగు: లెక్కలు సరిగా చేయడం లేదని పదో తరగతి విద్యార్థిని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ గోడ కుర్చీ వేయించాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాయదుర్గం సీఐ సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని నాగార్జున హైస్కూల్​లో బాలు అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. 

ఇదే స్కూల్లో అబ్దుల్ నయీమ్ మాథ్స్ టీచర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న లెక్కలు సరిగా చేయడం లేదని గోడ కుర్చీ వేయించడంతోపాటు అందరి ముందు తిట్టడంతో బాలు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇంటికి వెళ్లి, ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తల్లిదండ్రులు గమనించి బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలు వెంటిలేటర్​పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే, అందరి ముందు తిట్టడం,  గోడ కుర్చీ వేయించిన కారణంగానే తన కొడుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాలుడి తల్లి రాయదుర్గం పీఎస్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.