కొబ్బరికాయల లోడ్​ మధ్యలో గంజాయి తరలిస్తున్న ముఠా

కొబ్బరికాయల లోడ్​ మధ్యలో గంజాయి తరలిస్తున్న ముఠా

ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా సీజ్​.. నలుగురు అరెస్ట్​

నేరెడ్ మెట్, వెలుగు: కొబ్బరికాయల లోడ్​ మధ్యలో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్​ ఎస్ఓటీ, ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్​ చేసి, వారి వద్ద రూ.2 కోట్లు విలువైన 900 కిలోల గంజాయి, ఒక డీసీఎం, 5 సెల్ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరెడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్​ ఆఫీస్​లో మీడియాకు సీపీ మహేశ్​భగవత్​ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన వికాస్​ బబన్​ సాల్వే (28), వినోద్​ చంద్రావన్​ కల్కార్​ (26), కిశోర్​ తులసీరామ్​ వాడేకర్​ (24), కోస చిట్టిబాబు (19)ను అరెస్ట్​ చేశారు. యోగేశ్​ దత్తు, ఒడిశాకు చెందిన పాలసి కర్రయ్య కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడైన యోగేశ్​​ దత్తు గంజాయి అమ్మాలని తన ఫ్రెండ్స్​ వికాస్​ బబన్​, వినోద్​, కిశోర్​లకు చెప్పాడు. తామంతా కలిసి గంజాయి అమ్మితే మంచి కమీషన్​ వస్తుందన్నాడు.

తనకు గంజాయి కావాలని  ఒడిశాలోని మల్కాన్​గిరికి చెందిన కోస చిట్టి బాబుకు యోగేశ్​​ చెప్పాడు. గంజాయి తీసుకెళ్లడానికి తన మనుషులను పంపిస్తున్నానని తెలిపాడు. దాంతో డీసీఎం డ్రైవర్​ కిశోర్​ను తీసుకుని వికాస్, వినోద్​లు బయలుదేరారు. మొదట తూర్పు గోదావరిలోని రావులపాలెంకు వెళ్లి కొబ్బరికాయలు కొని డీసీఎంలో లోడ్​ చేశారు. అనంతరం అక్కడి నుంచి మల్కాన్​గిరికి వెళ్లి 900 కిలోల గంజాయి కొన్నారు. సరుకును కొబ్బరికాయల కింద లోడ్​ చేసి మహారాష్ట్రకు బయలుదేరారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్​ ఎస్ఓటీ పోలీసులు ఆలేరు​ పోలీసులతో కలిసి సోమవారం ఆలేరు​చౌరస్తాలో వెహికల్​ను అడ్డుకున్నారు. నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలిస్తామని, వారిపై పీడీ యాక్ట్​ పెడతామని మహేశ్​ భగవత్​ తెలిపారు.