ఆన్లైన్ ఫార్మా.. అడ్డగోలు దందా! పాత, కొత్త, ఏఐ ప్రిస్క్రిప్షన్లను గుర్తుపట్టి అలర్ట్ చేయలేని వ్యవస్థ

ఆన్లైన్ ఫార్మా.. అడ్డగోలు దందా! పాత, కొత్త, ఏఐ ప్రిస్క్రిప్షన్లను గుర్తుపట్టి అలర్ట్ చేయలేని వ్యవస్థ
  • క్లిక్ చేసుడే ఆలస్యం అబార్షన్ కిట్లు, మత్తు మందుల సరఫరా 
  • సేల్స్ బిల్లులు, షెడ్యూల్ హెచ్1 మందుల రిజిస్టర్లు, 
  • పర్చేజ్ ఇన్వాయిస్లు నిల్​ 
  • మెయిన్ ఆఫీసులు ఢిల్లీలో.. దేశవ్యాప్త అమ్మకాలు 
  • ఇటీవలే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లింక్డ్ మెడికల్ స్టోర్స్‌‌‌‌‌‌‌‌పై డీసీఏ దాడులు 
  • పలు అక్రమాలు బట్టబయలు... 
  • 41 షాపులకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీ వ్యాపారం అక్రమాలకు అడ్డాగా మారుతున్నది. క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ ఇంటికి వస్తాయన్న సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని, కొన్ని సంస్థలు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ను గాలికి వదిలేస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో ప్రజలకు దగ్గరవుతున్న ఈ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ అమ్మకాలకు అడ్డాగా మారుతున్నాయి.


రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాల్సిన సైకోట్రోపిక్ మందులు, అబార్షన్ కిట్లను కూడా విచ్చలవిడిగా సప్లై చేస్తున్నాయి. క్వాలిఫైడ్ ఫార్మసిస్టు పర్యవేక్షణ లేకుండానే.. ప్రిస్క్రిప్షన్లను తనిఖీ చేయకుండానే మందులను సప్లై చేస్తున్నాయి. కోల్డ్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌లో నిల్వ ఉంచాల్సిన మందులను కూడా సరైన రీతిలో భద్రపరచడం లేదు. ఇలాంటి మందులు వాడటం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఫార్మసీలపై మరింత పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందంటుని పేర్కొంటున్నారు. 

  • ఏ మందైనా అర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన క్షణాల్లోనే..

గతంలో కొన్ని యాప్స్‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు ఫుడ్, గ్రాసరీ డెలివరీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు కూడా విస్తరించింది. బయటి మెడికల్ షాపుల కంటే ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తుండటం, ఇంటి గుమ్మం వద్దకే మందులు వస్తుండటంతో.. ప్రజలు కూడా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మాకే మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా ఈ సంస్థలు రూల్స్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేస్తున్నాయి. క్లిక్ చేసేదే ఆలస్యం మత్తునిచ్చే సైకోట్రోఫిక్ డ్రగ్స్ నుంచి, అబార్షన్ కిట్ల వరకు సప్లై చేస్తున్నాయి. 

రూల్స్ ప్రకారం స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన అబార్షన్ కిట్లు, సైకోట్రోఫిక్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను సైతం ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ సంస్థలు హోం డెలివరీ చేస్తుండటం గమనార్హం. గుండె సమస్యలను వాడే టెర్మిన్ ఇంజెక్షన్లు కూడా మజిల్ పెరుగుదల కోసం జిమ్‌‌‌‌‌‌‌‌లలో వాడుతున్నారు. ఈ ఇంజెక్షన్లు అన్ని దాదాపు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆర్డర్లు చేసినవే అని డీసీఏ అధికారుల తనిఖీల్లో తేలింది.

  • ఏ ప్రిస్క్రిప్షన్ అయినా ఓకే.. 

ప్రస్తుతం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను కూడా కేటుగాళ్లు మోడిఫై చేస్తున్నారు. ఒకసారి వాడిన ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌నే మళ్లీ మళ్లీ అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో డాక్టర్ల సిగ్నేచర్లను, మందుల పేర్లను, తేదీలను ఫోర్జరీ చేసి నకిలీ ప్రిస్క్రిప్షన్లను క్రియేట్ చేస్తున్నారు. అయితే, నకిలీ వాటిని గుర్తించి రిజెక్ట్ చేసే టెక్నాలజీ ఈ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లలో లేకపోవడంలో ఏ ప్రిస్క్రిప్షన్ అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసినా.. యాక్సెప్ట్ చేసి మందులు సప్లై చేస్తున్నారు. 

కొన్నిసార్లు అయితే ఎలాంటి ప్రిస్ర్కిప్షన్ లేకుండానే మందులు అమ్ముతున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొన్ని మందులను నిర్ణీత టెంపరేచర్లలో మాత్రమే నిల్వ ఉండాల్సి ఉంటుంది. చాలా వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మా లింక్డ్ మెడికల్ షాపులు, గోడౌన్లు మందులను సరైన టెంపరేచర్లలో నిల్వ చేయడం లేదు. అలాంటి మందులు వాడితే, పనిచేయకపోగా, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. 

  • ఆఫీసులన్నీ నార్త్‌‌‌‌‌‌‌‌లో... 

చాలా వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీల ప్రధాన కార్యాలయాలు ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో ఉంటున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్త అమ్మకాలను పర్యవేక్షిస్తూ, స్థానికంగా ఉండే రూల్స్ బేఖాతరు చేస్తున్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీలు.. సేల్స్ బిల్లులు, షెడ్యూల్ హెచ్1 మందుల రిజిస్టర్లు, పర్చేజ్ ఇన్వాయిస్లు మెయింటెన్ చేయడం లేదని ఇటీవలే డీసీఏ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అయితే, మెడికల్ షాపుల్లో ఏయే మందులు మందులు ఉన్నాయి? ఎలా అమ్ముతున్నారు? అని గుర్తించడానికి వీలుగా ఉంటుంది.

 ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఎవరు ఏ మందులు ఆర్డర్ చేస్తున్నారో డీసీఏ అధికారులు గుర్తించడం కష్టం అవుతున్నది. అప్పుడప్పుడు తనిఖీలు చేసినా.. అక్రమాలు గుర్తిస్తే.. స్థానిక వ్యక్తులను మాత్రమే పట్టుకుంటున్నారు. పోలీసులకు ఉండే పవర్స్ డీసీఏ అధికారులకు లేకపోవడంతో.. నార్త్ ఇండియాలో ఉండే అసలైన నిందితుల వరకు వెళ్లలేకపోతున్నారు. ఇది కూడా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మా కంపెనీలకు అనుకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • 41 షాపులకు డీసీఏ నోటీసులు.. 

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీలపై తనిఖీలు నిర్వహించింది. మొత్తం 166 మెడికల్ షాపులను (159 ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ డెలివరీ సర్వీస్ షాపులు, 7 బీ2బీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ ఫారమ్ అనుబంధ షాపులు) తనిఖీ చేసి, రూల్స్ ఉల్లంఘించిన 41 షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లతో సంబంధం ఉన్న మెడికల్ షాపులైనా కచ్చితంగా ప్రభుత్వ రూల్స్ పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని డీసీఏ అధికారులు హెచ్చరించారు. మందుల విక్రయాల్లో ఏదైనా అక్రమాలు గమనిస్తే ప్రజలు 1800 599-6969 టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.