10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్ర లో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైతే కఠినమైన ఆంక్షలను విధిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో కొత్తగా 8,067 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే ఈ సంఖ్య డబుల్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

భీమా కోరెగావ్ పోరుకు 204 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పెర్నె గ్రామంలో జయస్తంభ్ మిలిటరీ మాన్యుమెంట్‌ను సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే అసెంబ్లీ సమావేశాలను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చిందని అజిత్ పవార్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు 10 మంది మంత్రులకు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్, బర్త్ డేలు, మరే అకేషన్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.  ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా స్ప్రెడ్ అవుతోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.