హైదరాబాద్ ట్రాఫిక్ సీఐ బలుపు.. డ్రైవర్లను బూతులు తిడుతూ.. తంతూ.. వికృత ప్రవర్తన

హైదరాబాద్ ట్రాఫిక్ సీఐ బలుపు.. డ్రైవర్లను బూతులు తిడుతూ.. తంతూ.. వికృత ప్రవర్తన

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ఈ ట్రాఫిక్ పోలీస్ ప్రవర్తన చూసి ఏమంటుందో మరి. విధుల్లో ఉన్నామన్న సోయి మరిచిపోయి.. అహంకారంతో డ్రైవర్లను నానా మాటలు అన్నాడు ఓ ట్రాఫిక్ పోలీస్. అంతటితో ఆగలే. డ్రైవర్లపై చేయి చేసుకుని.. కాలితో ఇష్టానుసారంగా తన్నాడు. 

అతని బలుపు చూసి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్లలో ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి సెప్టెంబర్ 12న అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా ట్రావెల్స్ బస్సులను ఆపి, చెక్ చేయడం, సరైన పత్రాలు లేని వాటిని స్వాధీనం పరచుకోవడం ఇదే అతని పని. 

అవి మాత్రమే చేస్తే కొత్తేముంటుంది అనుకున్నాడో ఏమో. డ్రైవర్లను బెదిరిస్తూ కిందకి దిగమన్నాడు. డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.  వారు మాట్లాడుతున్న క్రమంలోనే మీదిమీదికి వెళ్లాడు. చెంప దెబ్బలు కొట్టాడు. 

కాలితో విచక్షణా రహితంగా తన్నాడు. ఇదంతా చూస్తున్న తోటి సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.  

తన హద్దులు దాటి పబ్లిక్ పై అమానుషంగా ప్రవర్తించిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. డ్రైవర్ల తప్పు చేస్తే చలాన్ వేసి కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. లంచాలకు అలవాటు పడి ఇలా వికృతంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సీఐపై చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. 

ఈ ఘటనపై ట్రాఫిక్‌ సీఐ వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. "బస్సు డ్రైవర్ ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. ఆపే ప్రయత్నం చేసినా వేగంగా వెళ్లాడు. ఐడీపీఎల్‌ చౌరస్తాలో బస్సును ఆపాం. ఈ క్రమంలో డ్రైవర్‌ మాతో దురుసుగా ప్రవర్తించాడు. అవరసరమైతే చలానా వేసుకోండి.. బస్సును ఎందుకు ఆపుతున్నారంటూ వాగ్వాదానికి దిగి సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో చేసేదేమీ లేక అతన్ని అడ్డుకునేందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది’’ అని సీఐ చెప్పారు.