తూప్రాన్​లో కూలిన ..శిక్షణ విమానం

తూప్రాన్​లో కూలిన ..శిక్షణ విమానం
  • పైలట్, ట్రైనీ పైలట్ మృతి 

తూప్రాన్, వెలుగు : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్ సమీపంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోగా పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరూ మృతిచెందారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సోమవారం ఉదయం 8 గంటల సమయంలో తూప్రాన్ మున్సిపల్ శివారులో గుట్టల్లో కుప్పకూలింది. 

భారీ శబ్దం రావడంతో   గ్రామస్తులు, స్థానికులు విమానం కుప్పకూలిన స్థలానికి  చేరుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూప్రాన్ పోలీసులు అక్కడికి చేరుకొని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు చెప్పారు. దీంతో రెండు హెలికాప్టర్లలో వచ్చిన అధికారులు, స్థానిక పోలీసులు, ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పారు.  విమానంలో ఉండాల్సిన పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు కనిపించకపోవడలంతో.. వారు విమానం నుంచి  దూకారా? మంటల్లో కాలిపోయారా? అనే అనుమానంతో వెతికారు.

బయట ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో వారు మంటల్లో చిక్కుకొని కాలిపోయినట్లు నిర్ధారించారు. టెక్నికల్ సమస్యతోనే ప్రమాదం జరిగిందని చనిపోయిన ఇద్దరిలో వియాత్నం దేశానికి చెందిన ఉవాంతైన్, ఇండియాకు చెందిన అభిమన్యూరాయ్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఉవాంతైన్ ఇంకో 10 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని వారి దేశానికి వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదంలో జరిగింది.