19 నుంచి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ట్రైనింగ్ : పంచాయతీరాజ్ శాఖ

19 నుంచి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ట్రైనింగ్ : పంచాయతీరాజ్ శాఖ
  •     వచ్చే నెల 21 వరకు సమగ్ర శిక్షణ
  •     షెడ్యూల్​ను ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ
  •     టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులు

హైదరాబాద్, వెలుగు: గ్రామపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్  షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఖరారు చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. 

ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాలవారీగా ఈ కార్యక్రమం కొనసాగనున్నది. సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులు, పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేలా శిక్షణ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. ఆచరణలో ఉపయోగపడేలా పక్కా పాఠ్యప్రణాళికతో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ ను సిద్ధం చేశారు. 

ప్రతి జిల్లాలో ఐదు బ్యాచ్​లుగా విభజన

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్‌‌‌‌‌‌‌‌లుగా ఎన్నికయ్యారు. వీరికి గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పరిపాలన లక్ష్యంగా శిక్షణ ఇవ్వనున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసేలా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి జిల్లాలో 5 బ్యాచ్‌‌‌‌‌‌‌‌లుగా విభజించి సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు శిక్షణ ఇవ్వనుండగా.. ఒక్కో బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కనీసం 50 మంది సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఉంటారు. 

ఒక్కో బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో సర్పంచ్‌‌‌‌‌‌‌‌కు ఐదు రోజుల పాటు బస, భోజనం, శిక్షణ ఖర్చుల కోసం రూ.5 వేల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ శిక్షణ కోసం మొత్తం 253 మంది మాస్టర్  ట్రైనర్లను ఎంపిక చేశారు. ఇప్పటికే వారికి టీజీఐఆర్డీలో ఒరియెంటేషన్  పూర్తి చేశారు. వీరు సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలపై శిక్షణ అందిస్తారు. 

ఈ నేపథ్యంలో శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు భోజనాలు, వసతి సౌకర్యాలు, శిక్షణా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా  పంచాయతీలు బలోపేతం అవుతాయని, పారదర్శక పాలన, సమర్థవంతమైన నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.