ఆదివాసీ మహిళనుఆదుకుంటాం : భట్టి విక్రమార్క

ఆదివాసీ మహిళనుఆదుకుంటాం : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి
  • నిమ్స్​ దవాఖానలో చెంచుమహిళకు పరామర్శ 

పంజాగుట్ట, వెలుగు : నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం  మొలచింతపల్లికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటన బాధాకరమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బాధితురాలిని అన్నివిధాలా ఆదుకుంటామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్టు చెప్పారు. ఘటన తర్వాత నాగర్​ కర్నూల్​దవాఖానలో చికిత్స పొందిన ఆమెకు.. మెరుగైన వైద్యం అందించేందుకు ఆదివారం రాత్రి నిమ్స్​ హాస్పిటల్​లో చేర్చామని వివరించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క సోమవారం బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆమెకు ఇల్లు లేకుంటే ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరు చేస్తామని, సాగు చేసుకునేందుకు వ్యవసాయ భూమి ఇస్తామని తెలిపారు. వారి ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ద్వారా చదివిస్తామన్నారు.  బాధితురాలు కోలుకునే వరకు వైద్యం అందించాలని నిమ్స్​ డైరెక్టర్​ నగరి బీరప్పను డిప్యూటీ సీఎం ఆదేశించారు.