లక్నో: సౌదీ అరేబియా నుంచి ఓ వ్యక్తి యూపీలోని తన భార్యతో ఫోన్ మాట్లాడుతుండగా.. అతనికి సమీపంలో ఇరాన్ మిసైల్ పడింది. దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి అతని భార్యతోపాటు ఆ కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహ్ముదాబాద్‌కు చెందిన రవి గోపాల్(26) సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో డ్రైవర్ జాబ్ చేస్తున్నాడు.
ఈ నెల18న రాత్రి 9:30 గంటలకు తన భార్య రీతూకు ఫోన్ చేసి.. సరదాగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత..రవి వైపు నుంచి రీతూకి ఏదో అలజడి వినిపించింది. తర్వాత ఒక్కసారిగా కాల్ కట్ అయిపోయింది. రీతూ ఎన్నిసార్లు ప్రయత్నించినా రవి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో రవికి ఏం జరిగిందోనని ఆ కుటుంబం భయాందోళనలో మునిగిపోయింది. మరుసటి రోజు ఉదయం వారి భయమే నిజమైంది.
ఇరాన్ క్షిపణి తన సమీపంలో పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితుడు రామ్ నివాస్ సమాచారం అందించాడు. రాత్రే ఫోన్ మాట్లాడిన రవి తెల్లారేసరికి చనిపోయాడని తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 18వ తేదీనాటి ఫోన్ కాలే తమ చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదంటూ రవి భార్య రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.రవి మరణంతో అతని భార్య, నాలుగేండ్ల కొడుకు దిక్కులేని వారయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
