SBI బ్రాంచ్ మేనేజర్ వీడియో వైరల్.. దెబ్బకు చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ !

SBI బ్రాంచ్ మేనేజర్ వీడియో వైరల్.. దెబ్బకు చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ !

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగిని వ్యవహార శైలి వివాదానికి దారి తీసింది. బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్తో ఆమె ప్రవర్తించిన తీరు దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయి కర్ణాటక సీఎం స్పందిస్తూ ట్వీట్ పెట్టేంత వరకూ పరిస్థితి వెళ్లింది. ఎస్బీఐ ఆమెను ప్రస్తుతం పనిచేస్తున్న బ్రాంచ్ నుంచి బదిలీ చేసింది.

అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని  అనేకల్ తాలూకాలో ఉన్న సూర్య నగర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లో ఒక మహిళ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తోంది. అయితే.. బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్ ఆమెను కన్నడలో మాట్లాడాలని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో కస్టమర్కు, ఆమెకు మధ్య గొడవ జరిగింది. ‘‘ఇది కర్ణాటక మేడం’’ అని కస్టమర్ అన్నాడు.

అందుకు ఆమె బదులిస్తూ.. ‘‘ఇది ఇండియా.. నీ కోసం నేను కన్నడలో మాట్లాడను. హిందీలోనే మాట్లాడతాను’’ అని గట్టిగా అరుస్తూ చెప్పింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకానొక సమయానికి.. ‘‘నేను కన్నడలో మాట్లాడనంటే మాట్లాడను’’ అని ఆ మహిళ తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కన్నడిగులు భగ్గుమన్నారు. 

ALSO READ | Income Tax: ITR-U టాక్స్ ఫారం నోటిఫై.. ఇక తప్పులు సరిచేసుకోవటానికి 4 ఏళ్లు గడువు..

కన్నడ నెటిజన్లు ‘ఎక్స్’లో ఈ వీడియోను పోస్ట్ చేసి భారత ఆర్థిక శాఖ మంత్రికి, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేసి కస్టమర్లతో బ్యాంకు ఉద్యోగులు ఎంత దురుసుగా ప్రవరిస్తున్నారో చూడండని ఎత్తిచూపారు. ఈ వీడియో వైల్డ్ ఫైర్లా వ్యాపించి ఎస్బీఐ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. ఆ బ్యాంకు ఉద్యోగినిని బదిలీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇంత జరిగాక సదరు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

కన్నడిగ అయిన తన సహోద్యోగి సాయంతో తాను ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే క్షమించాలని కన్నడలో చెప్పింది. కన్నడ మాట్లాడనంటే మాట్లాడనన్న ఆమెనే చివరికి కన్నడలోనే క్షమాపణ కోరాల్సి వచ్చింది. ఇకపై కస్టమర్లతో కన్నడలోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ ఎస్బీఐ ఉద్యోగిని చెప్పడం గమనార్హం. ఈమె దురుసు ప్రవర్తనపై, కన్నడ మాట్లాడనంటే మాట్లాడననడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆమె తీరును సీఎం ఖండించారు. ఈ ఘటనపై ఎస్బీఐ కూడా క్షమాపణ కోరింది.