Income Tax: ITR-U టాక్స్ ఫారం నోటిఫై.. ఇక తప్పులు సరిచేసుకోవటానికి 4 ఏళ్లు గడువు..

Income Tax: ITR-U టాక్స్ ఫారం నోటిఫై.. ఇక తప్పులు సరిచేసుకోవటానికి 4 ఏళ్లు గడువు..

ITR-U Notified: మోదీ సర్కార్ ఇటీవలి కాలంలో పన్ను చెల్లింపుదారులకు సరళమైన, అనుకూలమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ద్వారా తలెత్తే సమస్యల పరిష్కారం, నివారణకు ఇకపై టాక్స్ పేయర్స్‌కి అవకాశం కల్పించాలని వారు భావిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఆదాయపు పన్ను సంస్థ నేడు అప్ డేటెడ్ రిటర్న్ ఫారమ్ ఐటీఆర్-యు ని అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీని కింద పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన తమ పన్ను ఫారమ్ లో తప్పులు లేదా లోపాలను సరిచేసుకోవటానికి అవకాశం కల్పించబడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ చట్టం 2025లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా ఇది తీసుకురాబడింది.

 

గతంలో పన్ను చెల్లింపుదారులు గడచిన 24 నెలల కాలం అంటే రెండేళ్లలో ఫైల్ చేసిన తమ పన్ను రిటర్న్స్ మాత్రమే తప్పులు సరిచేసుకోవటానికి అనుమతించబడేవారు. అయితే ప్రస్తుతం కొత్త చట్టంలో తెచ్చిన మార్పుల కింద వారికి ఈ గడువు 48 నెలలకు పొడిగించబడింది. అంటే ఎవరైనా టాక్స్ పేయర్ గడచిన 4 ఏళ్ల కాలానికి చెందిన ఏదైనా తన రిటర్న్ లో ఆదాయం చూపటం మిస్ అయినా లేక తప్పులు చేసినా వాటిని ఐటీఆర్-యు ఫారం కింద మార్పులు చేసి తిరిగి సబ్మిట్ చేయవచ్చు. 

ఏఏ కారణాల కింద ITR-U దాఖలు అనుమతిస్తారు..?
* గతంలో అసలు రిటర్న్ దాఖలు చేయకపోవటం
* ఆదాయాన్ని తప్పుగా చూపటం
* ఆదాయాన్ని తప్పుడు విభాగాల కింద పొందుపరచటం
* క్యారీ ఫార్వర్డ్ నష్టాల తగ్గింపు
* డిప్రీషియేషన్ తక్కువగా చూపటం
* 115JB/115JC సెక్షన్ల కింద పన్ను క్రెడిట్ తగ్గింపులు
* తప్పుడు టాక్స్ రేటు సెలెక్ట్ చేయటం
* రిటర్న్ దాఖలు తర్వాత పొందిన ఆదాయం చూపటం కోసం

రిటర్న్ ఆలస్యానికి పన్ను జరిమానాలు..
* అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన ఏడాది తర్వాత ఐటీఆర్-యు దాఖలులో పన్ను బకాయి మెుత్తంపై 25 శాతం పెనాల్టీ విధించబడుతుంది
* 12 నెలల నుంచి 24 నెలల కాలానికి ఆదాయంపై రిటర్న్ కి 50 శాతం జరిమానా.
* 24 నెలల నుంచి 36 నెలల నవీకరించబడిన రిటర్న్ దాఖలుపై 60 శాతం అదనపు పన్ను వర్తింపు.
* 36 నెలల నుంచి 48 నెలల మధ్య చేసిన దాఖలుపై 70 శాతం అదనపు పన్ను విధించబడుతుంది.

గడచిన మూడేళ్లలో ఇలా తర్వాత నవీకరించిన రిటర్న్స్ నుంచి ప్రభుత్వానికి ఏకంగా 8వేల 500 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో దాదాపు 90 లక్షల రిటర్న్స్ వచ్చాయి. ప్రస్తుతం గడువు నాలుగేళ్ల వెనకటి రిటర్న్స్ కూడా సరిచేసేందుకు అవకాశం కల్పించటంతో ప్రభుత్వ ఖజానాకు ఈ ఆదాయం మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.