బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది తెలంగాణ CID. ఈ కేసు విచారణలో భాగంగా 2025 నవంబర్ 15 వ తేదీన విచారణకు హాజరయ్యారు నటుడు దగ్గుబాటి రానా, యాంకర్ విష్ణుప్రియ. సీఐడీ నోటీసులతో హైదరాబాద్ లోని లకిడీకాపూల్ లోని సీఐడీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరయ్యారు.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్ల వివరాలు సేకరించి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు సీఐడీ అధికారులు. రానా, విష్ణుప్రియను వేర్వేరుగా విచారిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల చిట్టాపై దృష్టి:
ప్రస్తుతం సిట్ అధికారులు దృష్టి అంతా ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే ఉంది. ఈ ప్రమోషన్ల కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల్లో జమ అయింది, హవాలా మార్గాల ద్వారా ఏమైనా చెల్లింపులు జరిగాయా అనే అంశాలపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రముఖులు కేవలం ప్రచార కర్తలుగానే ఉన్నారా, లేక వారికి అంతకుమించి ఏమైనా పాత్ర ఉందా అనే కీలక కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు గంటన్నరపాటు విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు అధికారులు.
