40 వేల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. ఎందుకంటే..?

40 వేల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. ఎందుకంటే..?

దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ వేల సంఖ్యలో కార్ల రీకాల్‌తో వార్తల్లో నిలిచింది. డిసెంబర్ 9, 2024 నుండి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన మొత్తం 39,506 గ్రాండ్ విటారా వాహనాలను కంపెనీ ప్రస్తుతం వెనక్కి పిలుస్తోంది.  కొన్ని వాహనాల్లో ఫ్యూయల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్‌లు సరైన సమాచారం చూపడం లేదనే అనుమానంతో రీకాల్ చేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది.  

మారుతీ సుజుకీ తన షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ లోపాలను తనిఖీ చేసి, అవసరమైతే స్పీడోమీటర్ అసెంబ్లీ భాగాన్ని ఉచితంగా మార్చడం చేపడుతోంది. దీని గురించి వాహన యజమానులకు సంస్థ వ్యక్తిగతంగా సమాచారం అందజేయనుంది. దీనివల్ల కస్టమర్లకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా వాహన భద్రతను నిర్థారించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.  

వాస్తవానికి గ్రాండ్ విటారా సిరీస్ మారుతీకి ఇప్పటివరకు భారీ విజయం సాధించింది. కేవలం 32 నెలల్లో 3 లక్షల యూనిట్లు విక్రయించి బెస్ట్ సెల్లర్లలో నిలిచింది. ఈ మైలురాయిని పురస్కరించుకొని కంపెనీ  ‘Driven by Tech’ పేరుతో యాడ్ క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఈ ప్రకటన గ్రాండ్ విటారాను ఆధునిక, టెక్-సావి వినియోగదారుల కోసం రూపొందించిన స్మార్ట్ SUVగా కంపెనీ చూపుతోంది. విజయంపై మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ కూడా వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ SUV మారుతీ సుజుకీని మధ్య-శ్రేణి మార్కెట్లో మరింత బలపరిచిందన్నారు. 

మొత్తంగా గ్రాండ్ విటారా రీకాల్ ఘటన తాత్కాలిక ఇబ్బంది మాత్రమే అయినప్పటికీ.. భారత ఆటో రంగంలో మారుతీ సుజుకీ దూసుకెళ్తున్న ప్రయాణంలో అది చిన్న విరామం మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.