ముంబై: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలడంతో ముంబైలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముంబైలోని ములుంద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న పిల్లర్ ఉన్నట్లుండి కుప్పకూలింది. అది రోడ్డుపై వెళ్తున్న ఆటో, మరో కారుపై పడింది. దీంతో ఆ వాహనాల్లోని రామ్‌ధన్ యాదవ్(55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు యువకులకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడితోపాటు గాయాలైనవాళ్లంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవాళ్లుగా అధికారులు గుర్తించారు.
వారు ముంబై పర్యటనకు వచ్చారని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్, మున్సిపల్, మెట్రో అధికారులు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడినవారికి పూర్తి సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్యాప్తుకు ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి చికిత్స ఖర్చులు అందజేస్తామని తెలిపారు.
