- ఇందుకేనా జీతాలు తీసుకునేది?: ఎంపీ ధర్మపురి అర్వింద్
- నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లిన్రు
- మేయర్ పదవి కోసం కాంగ్రెస్, మజ్లిస్అనైతిక సంసారానికి రెడీ అయ్యాయని కామెంట్
నిజామాబాద్, వెలుగు: మున్సిపల్‌ఎన్నికల్లో పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ఆరోపించారు. కాంగ్రెస్ కోసం నగరపాలక సంస్థలో గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లడానికి ఏసీపీ, నలుగురు ఎస్ఐలు కష్టపడ్డారని, వారు జీతాలు తీసుకుంటున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. నిజానికి పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. ‘‘మున్సిపల్‌ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు పంపారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని ఓ బూత్ వద్ద ఓటర్లను ఓ కానిస్టేబుల్ కోరారు. కాంగ్రెస్ కోసం పోలీసులను వాడుకుంటున్న తీరును ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టిన్రు.
డిపార్ట్మెంట్చేయాల్సింది ఇదేనా? లా అండ్ఆర్డర్ కాపాడడం అంటే ఇట్లనే ఉంటదా?” అని ప్రశ్నించారు. హుందా రాజకీయాలను భ్రష్టు పట్టించినందుకే కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపారని, సీఎం రేవంత్‌రెడ్డికి అదే పరిస్థితి వస్తది అని అన్నారు. ఎన్నికలప్పుడు బీజేపీకి, మజ్లిస్‌కు సమాన దూరమని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రచారం చేశారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. మరిప్పుడు మేయర్ పదవి కోసం ఎట్లా జతకడతారని, ఎట్లా అనైతిక సంసారం చేస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనని తాను చెప్పిన మాట ఇప్పుడు నిజం కాబోతున్నదన్నారు. ‘‘రేవంత్‌రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు స్లోగా వెళ్తుందో ఆరా తీసి స్పీడప్ చేస్తాం. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం. ఈ కేసు వేగం పెంచాలని సెంట్రల్ మినిస్టర్ కిషన్‌రెడ్డిని ఇది వరకే డిమాండ్ చేసిన. ఇప్పుడు మరోసారి కోరుతున్న. కేటీఆర్‌పై ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులను కూడా స్పీడ్ చేయాలె” అని అన్నారు.
