క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్..అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సరికొత్త క్యాన్సర్ చికిత్స అందుబాటులో రానుంది. అడ్వాన్స్డ్ జనటిక్ ఇంజనీరింగ్ సిస్టమ్ తో క్యాన్సర్ కణితిపై మాత్రమే చర్యలు జరిపి వాటి కణాలను నాశనం చేసే కొత్త చికిత్సా విధానం ఇది. కీమో థెరపీ, రేడియేషన్ వంటి సాంప్రదాయ చికిత్సలతో కలిగే దుష్ప్రభావాలు ఉండవట. అదే నానారోబోట్ చికిత్స..
క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే సరికొత్త నానోరోబోట్ చికిత్స అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు ఈ నానోరోబోట్‌లను అభివృద్ధి చేసి ఎలుకలలో విజయవంతంగా పరీక్షించారు.
నానోరోబోట్లు అంటే..?
ఇవి నానోమీటర్ స్కేల్‌పై లేదా నానోమీటర్ల పరిమాణంలో (నానోమీటర్ అంటే మీటర్‌లో బిలియన్ వంతు) రూపొందించబడిన చిన్న పరికరాలు. వాటి చాలా చిన్న పరిమాణం కారణంగా నానోరోబోట్‌లు కణాలతో నేరుగా సంకర్షణ చెందుతాయి. ప్రత్యేకించి DNA నానోరోబోట్‌లు నిర్దిష్ట అణువులను రవాణా చేయగలవు.
DNA నానోరోబోట్ పరికరాలను ఉపయోగించి కరోలిన్స్కా పరిశోధకులు కణితుల లోపల లిగాండ్స్ అని పిలువబడే అణువుల శ్రేణిని టచ్ చేయగలిగారు. ఈ అణువులు క్యాన్సర్ కణాల ఉపరితలంపై ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ (TNF) గ్రాహకాలు అని పిలువబడే నిర్దిష్ట ప్రోటీన్లకు బంధించగలవు. లిగాండ్స్ ద్వారా క్యాన్సర్ కణాలపై చికిత్స ప్రారంభిస్తారు. స్వీడిష్ పరిశోధకులు జన్యు పదార్ధంతో తయారు చేయబడిన నానోరోబోట్‌లో లిగాండ్‌లను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాలుచేసి సక్సెస్ అయ్యారు. అడ్వాన్స్డ్ పరిశోధనకు సంబంధించిన అధ్యయనం ఫలితాలు నేచర్ నానోటెక్నాలజీ అనే శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించారు శాస్త్రవేత్తలు.
నానోరోబోట్ చికిత్స ఎలా పనిచేస్తుంది?
నానోరోబోట్లు కణితిలక్ష్యంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేసే వాటి ఆయుధాలు నానో రోబోటిక్ నిర్మాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితి వాతావరణంలోకి చేరుకున్నాకే బహిర్గతం అవుతాయి. నానోరోబోటిక్ చికిత్స ప్రక్రియ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపుతుంది. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతుంది.
ప్రస్తుత క్యాన్సర్ చికిత్సలైన కీమోథెరపీ ,రేడియేషన్ థెరపీలు ఆరోగ్యకరమైన కణాలను కూడా చంపడంతో తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఈ నానోరోబోట్ టెక్నాలజీ క్యాన్సర్ చికిత్సను మరింత ఖచ్చితమైనదిగా ,తక్కువ దుష్ప్రభావాలతో కూడుకున్నదిగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక వినూత్న విధానం. ఇది క్యాన్సర్ కణాలను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.
