IND vs SA: జడేజా అరుదైన ఘనత.. కపిల్ దేవ్, బోథమ్‌ సరసన టీమిండియా ఆల్ రౌండర్

IND vs SA: జడేజా అరుదైన ఘనత.. కపిల్ దేవ్, బోథమ్‌ సరసన టీమిండియా ఆల్ రౌండర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్ లో దిగ్గజాల సరసన స్థానం సంపాదించాడు. టెస్ట్ క్రికెట్ లో ఒక వైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్ లో నిలకడగా రాణిస్తున్న జడేజా అసలు సిసలు ఆల్ రౌండర్ గా నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో 300 కంటే ఎక్కువగా వికెట్లు తీయడంతో పాటు 4000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ప్లేయర్ గా దిగ్గజాల సరసన నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. టీమిండియా ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తో పాటు న్యూజిలాండ్‌ ప్లేయర్ డేనియల్ వెట్టోరి.. ఇంగ్లాండ్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్ మాత్రమే బ్యాటింగ్ లో 4000 పైగా పరుగులు.. బౌలింగ్ లో 300 పైగా వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 11 పరుగుల వద్ద తన టెస్ట్ కెరీర్ లో 4000 పరుగుల మార్క్ పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్ లో కూడా జడేజా 300 పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో జడేజా తొలి ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. జడేజా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 88 టెస్టుల్లో 119 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 38.63 యావరేజ్ తో 4017 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 163 ఇన్నింగ్స్ ల్లో 24 యావరేజ్ తో 341 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం, జడేజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది జడేజా అత్యుత్తమంగా రాణించాడు. 2025లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో 14 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ 83.75 యావరేజ్ తో 670 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు,  ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2022 నుంచి జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. మార్చి 9, 2022న జాసన్ హోల్డర్‌ను అధిగమించి టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. 36 ఏళ్ల జడేజా భారత టెస్ట్ జట్టుకు మూలస్తంభంగా మారాడు. టెస్ట్ క్రికెట్ లో లోయర్ ఆర్డర్ లో కీలక పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. మార్చి 2022 నుండి రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు.

కోల్‌‌‌‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో బ్యాటింగ్ లో చేతులెత్తేయడంతో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు కేవలం 30 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. 39 పరుగులు చేసిన రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుందర్ (29), పంత్ (27), జడేజా (27) వచ్చిన మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు.. జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. హార్మర్,కార్బిన్ బాష్ లకు చెరో వికెట్ దక్కింది.