ప్రపంచ దేశాలు ఈ కాలంలో ఏఐ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. దింతో రష్యాకు చెందిన మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) తో నడిచే మనిషిలాంటి రోబోట్ (హ్యూమనాయిడ్ రోబోట్) మాస్కోలో జరిగిన షోలో నడుస్తూ తడబడుతూ స్టేజ్ పైనే పడిపోయింది. దీంతో షో కాస్తా ఇబ్బందుల్లో పడింది. ఇదంతా కెమెరాలో రికార్డై, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
సోమవారం జరిగిన ఒక టెక్నాలజీ కార్యక్రమంలో 'AIdol' అనే ఓ రోబోట్‌ను పరిచయం చేశారు. సినిమా పాటతో రోబోట్‌ను స్టేజ్ పైకి తీసుకొస్తుండగా అడుగులు తడబడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కింద పడగానే రోబోట్ ముక్కలుగా విడిపోయింది. Xలో షేర్ చేసిన వీడియోలో పడిపోయిన రోబోట్‌ను సిబ్బంది లేపి తీసుకెళ్లడం, వెంటనే ఒక నల్లటి కర్టైన్ షో క్లోజ్ చేస్తూ కనిపిస్తుంది.
ఏఐ రోబోట్ కింద పడడానికి సెట్టింగ్ సమస్యలే కారణమని, ఈ సంఘటన రోబోట్ టెస్టింగ్ సమయంలో ఉన్నప్పుడే జరిగిందని కంపెనీ తెలిపింది. రష్యన్ రోబోటిక్స్ సంస్థ AIdol CEO వ్లాదిమిర్ వితుఖిన్ మాట్లాడుతూ ఈ తప్పు అనుభవంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను అని అన్నారు.
ఈ వీడియోపై ఆన్‌లైన్‌లో రకరకాల కామెంట్స్ వచ్చాయి. కొంతమంది రోబోట్ నడకను ఎగతాళి చేయగా.. ఒకతను వోడ్కా తాగినట్లు అద్భుతంగా నటించింది అని కామెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం రోబోట్ ప్రయత్నాన్ని సమర్థించారు. మొదటి ప్రయత్నంలో ఇలాంటివి తప్పేం కాదు. రోబోటిక్స్ ఇలా ప్రయత్నించడం గొప్ప విషయం అని అన్నారు. మరొకరు రోబోట్ పడిపోయినప్పుడు విడిభాగాలు విడిపోవడం, దాన్ని దాచడానికి నల్లటి తెర రెడీగా ఉంచడం నాకు నిజంగా నచ్చింది అని కామంట్ చేసారు.
AIdol రోబోట్ గురించి:
ఈ రోబోట్ 48-వోల్ట్ బ్యాటరీపై ఆరు గంటల పాటు పనిచేయగలదు. ప్రస్తుతానికి ఇందులో 77% రష్యాలో తయారైన భాగాలు ఉన్నాయి, దీన్ని 93%కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోట్ 19 సర్వోమోటర్లతో పనిచేస్తూ, డజనుకు పైగా భావోద్వేగాలను ప్రదర్శించగలదు. దీని సిలికాన్ చర్మం మనిషి ముఖం పోలి ఉండేలా తయారు చేశారు. ఈ రోబోట్ మనిషిలాగే నవ్వగలదు, ఆలోచించగలదు, ఆశ్చర్యపోగలదు అని CEO చెప్పారు.
