బీహార్లో చక్రం తిప్పిన రూ.10 వేల స్కీమ్..

బీహార్లో చక్రం తిప్పిన రూ.10 వేల స్కీమ్..

ఎన్నికల ముందు ప్రకటించిన ఒకే ఒక్క స్కీమ్.. ఒక కూటమికి వరప్రదాయనిలా మారితే..  మరో పార్టీ పాలిట శాపంగా మారింది. బీహార్ ఎన్నికల ఫలితాలను వన్ సైడ్ చేసేసింది. విపక్ష కూటమి పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. దెబ్బకు ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేని విధంగా అద్భుతమైన ఫలితాలు ఎన్డీఏ కూటమిని అందలం ఎక్కించాయి. 

ఒక్క స్కీం.. ఐదేళ్ల అధికారం:

2025 నవంబర్ 14న విడుదల చేసిన ఫలితాలలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. 200 కు పైగా సీట్లలో లీడ్ లో ఉంటూ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. దీనికి ముఖ్యమైన కారణం.. ముఖ్యమంత్రీ మహిళా రోజ్ గార్ యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి మహిళ అకౌంట్ లోకి 10 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం. కోటీ 20 లక్షల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ స్కీమ్.. ఆ రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్తును మార్చేసింది. 2025 సెప్టెంబర్ 26 న ప్రారంభించిన ఈ స్కీమ్.. మహిళలను మొత్తం కన్వర్ట్ చేసేలా చేసింది. 

గంపగుత్తగా మహిళల ఓట్లు:

బీహార్ లో మహిళల ఓట్లు రిజల్ట్స్ ను పూర్తిగా ప్రభావితం చేసింది. ఎన్డీఏ తెచ్చిన కొత్త స్కీంతో మహిళలు గంపగుత్తగా ఎన్డీఏకు ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు ప్రతి మహిళా అకౌంట్ లో 10 వేల రూపాయలు పడటంతో మహిళలు అంతా నితీష్ వైపే మొగ్గినట్లు తెలుస్తోంది. దీనికి తోడు 2006 లో పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, 2013 లో రాష్ట్ర ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు.. మహిళలు జేడీయూ వైపే ఉండేలా చేసిందని అంటున్నారు. 

అన్ని జిల్లాల్లో మహిళా ఓట్లే అధికం:

బీహార్ ఎన్నికల సందర్భంగా మొత్తం 38 జిల్లా్ల్లో 37 జిల్లాల్లో మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ అధికంగా నమోదైంది. పురుషులు ఓటింగ్ 62.98 శాతం ఉండగా మహిళలు 71.78 శాతం నమోదైంది. దీంతో బీహార్ లో ఎన్నడూ లేనంతగా 67.13 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. 

ఎందుకు మహిళలు నితీష్ ను మళ్లీ నమ్మారు..?

మహిళలకు ఆర్థిక సహకారంతో పాటు ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా బీహార్ లో పనిచేసింది. బీహార్ ను జంగిల్ రాజ్ నుంచి నితీశ్ కాపాడారనే సెంటిమెంట్ మళ్లీ కొనసాగిందనే చెప్పాలి. 

వైన్స్ పై స్టేట్ మెంట్ ఆర్జేడీని దెబ్బతీసిందా..?

మరోవైపు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి మరో ఎదురుదెబ్బ వైన్స్ షాప్స్ బ్యాన్ ను ఎత్తేయాలని చేసిన కామెంట్స్ అంటున్నారు. బీహార్ లో 2016 నుంచి మద్యంపై నిషేదం నడుస్తోంది. అధికారంలోకి వస్తే బ్యాన్ ఎత్తేస్తామని.. దాని గురించి ఆలోచిస్తామని.. అటు తేజస్వీయాదవ్ తో పాటు ప్రశాంత్ కిషోర్ కూడా ప్రకటించారు. దీంతో వీళ్లు గెలిస్తే మళ్లీ పాతరోజులు వస్తాయి.. గృహ హింస, తాగుడుకు భానిసలై కుటుంబాలు నాశనం అవుతాయని మహిళ భావించినట్లు చెబుతున్నారు. 

ఇండియా కూటమికి మరో బ్లాక్ ఫైర్:

ఎన్నికల సందర్భంగా.. మద్య నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు కల్లును కూడా మినహాయిస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. పాసీ కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ హామీ బ్యాక్ ఫైర్ అయినట్లు చెబుతున్నారు. మహిళా ఓటర్లను దూరం చేయడంలో ఈ హామీలు ఇండియా కూటమికి నెగెటివ్ గా పనిచేయటమే కాకుండా.. నితీశ్ కు మహిళలను దగ్గర చేసినట్లు చెబుతున్నారు.