
- కరీంనగర్ జిల్లాలో వారం కింద ఘటన
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగర శివారు బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన వారం కింద జరిగిన వ్యక్తి హత్య మిస్టరీ వీడింది. తాగొచ్చి కొడుతున్నాడని అతని భార్యే.. ప్రియుడు, బంధువుతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మంగళవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) లైబ్రరీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య రమాదేవికి కిసాన్‌నగర్‌కు చెందిన కర్రె రాజయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. సంపత్ మద్యానికి బానిస కావడంతో తరుచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి.. సంపత్‌ను హత్య చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని తన ప్రియుడు రాజయ్యతో పాటు దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్‌కు చెప్పగా వాళ్లు ఒప్పుకున్నారు. ప్లాన్‌లో భాగంగా రాజయ్య, శ్రీనివాస్ కలిసి గత నెల 29న సంపత్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. సంపత్ మత్తులోకి వెళ్లిన తర్వాత రమాదేవికి రాజయ్య, శ్రీనివాస్ ఫోన్ చేశారు. భర్తను చంపేయాలని ఆమె చెప్పింది.
దీంతో తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవుల్లో పోశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సంపత్ కనిపించడం లేదంటూ రమాదేవి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. రాజయ్య, శ్రీనివాస్ కలిసి వెతుకుతున్నట్లు నటించారు. బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద డెడ్‌బాడీ దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంపత్ కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్య చేయించినట్లు ఒప్పుకున్నది. దీంతో రమాదేవితో పాటు రాజయ్య, కీసరి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 బైక్‌లు, 3 మూడు ఫోన్లు, మద్యం బాటిళ్లు, గడ్డి మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు తాండ్ర నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ అభినందించారు.