జహీరాబాద్, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏ పని లేకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. తల్లి గోపమ్మ(51) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని రోజులుగా బాలరాజ్ నిత్యం తాగివచ్చి గోపమ్మతో డబ్బుల కోసం గొడవ పడుతున్నాడు. ఇలాగే శుక్రవారం రాత్రి కూడా తాగి వచ్చి తల్లిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గోపమ్మ నిరాకరించడంతో బాలరాజ్ గొడ్డలితో ఆమెపై తలపై బలంగా కొట్టాడు. చుట్టుపక్కల వారు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. బాలరాజ్ పరారీలో ఉన్నాడు. కోహీర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
