పద్మారావునగర్, వెలుగు: అత్యవసర సమయాల్లో ప్రజలను ఆదుకునే డయల్ 112కు పలుమార్లు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసిన వ్యక్తికి సికింద్రాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల జైలు శిక్ష విధించింది.
వారసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంనగర్‌కు చెందిన డ్రైవర్ వర్ధ సతీశ్(34) ఈ నేరానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో డయల్ 112కు పలుమార్లు ఫోన్ చేసి తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ పోలీసులపై అసభ్యకర పదజాలంతో పలుమార్లు మాట్లాడాడు.
కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ బి.వి.నాగేందర్‌రెడ్డి శిక్ష విధించారు. గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించడంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారసిగూడ ఇన్‌స్పెక్టర్ జి.రాజేందర్‌గౌడ్ తెలిపారు.
