బెట్టింగ్​ కోసం బైక్ తాకట్టు.. అప్పులపాలై చివరకు..

బెట్టింగ్​ కోసం  బైక్ తాకట్టు.. అప్పులపాలై చివరకు..

ఆత్మకూరు, వెలుగు: క్రికెట్ బెట్టింగులతో అప్పుల పాలైన ఓ యువకుడు చివరికి తల్లిదండ్రులు కొనిచ్చిన బైక్​ను కూడా కుదువ పెట్టాడు. చివరికి ఆ డబ్బులూ బెట్టింగ్​లో పోగొట్టుకున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులతో గొడవ జరగడంతో ఉరేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండకు చెందిన సాంబారి నాగరాజు(23) మద్యానికి బానిసవ్వడమే కాకుండా ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నాడు. గత సంవత్సరం స్నేహితుల దగ్గర రూ. లక్షన్నర అప్పుగా తీసుకుని బెట్టింగ్​లో పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి ఆ అప్పులను తీర్చాడు. గత నెల నుంచి ఐపీఎల్ ​స్టార్ట్ ​కాగా మళ్లీ అప్పు చేసి బెట్టింగ్​లో పెట్టాడు. తల్లిదండ్రులు కొనిచ్చిన పల్సర్ బైక్ ను కూడా డబ్బుల కోసం కుదువ పెట్టాడు. మంగళవారం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇస్తే బండిని విడిపించుకుంటానని అడిగాడు. ఇప్పటికే చేసిన అప్పులు తీర్చామని, ఇక తమతో కాదని చెప్పడంతో కామ్​గా వెళ్లిపోయాడు. రాత్రి నాగరాజు ఒక గదిలో పడుకోగా, మరొక రూమ్​లో తల్లిదండ్రులు పడుకున్నారు. రెండో కొడుకు విఘ్నేశ్​ స్లాబ్ పైన నిద్రించగా, వర్షం రావడంతో కిందకు వచ్చి రూమ్​లోకి వెళ్లేందుకు నాగరాజును పిలిచాడు. అతడు తలుపు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నాగరాజు ఫ్యాన్​కు చీరతో ఉరివేసుకొని కనిపించాడు. తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు ఎస్సై హరిప్రియ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.