- ఐదేండ్ల కింద ఇచ్చిన ఫోన్లతోనే నెట్టుకొస్తున్న వైనం
- బ్యాటరీలు ఉబ్బి, చార్జింగ్ నిలవక, డిస్ప్లే లు రాక అవస్థలు
- హాజరు, గుడ్లు తదితర వివరాల అప్డేట్ వాటితోనే
- కొత్త ఫోన్ల కోసం టీజీటీఎస్‌కు ఇండెంట్.. అయినా కదలిక లేదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ స్మార్ట్‌గా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హార్డ్‌గా మారింది. గతంలో రిజిస్టర్లలో నమోదు చేసే వివరాలను ఫోన్లలో ఎంటర్ చేయాలని గతంలో ప్రభుత్వం అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు ఫోన్లను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు38 వేల అంగన్‌వాడీ, సూపర్వైజర్లకు ఈ ఫోన్లను ప్రొవైడ్ చేసింది. అయితే, ఆ ఫోన్లు ఇచ్చిన కొత్తలో బాగానే పనిచేసినప్పటికీ.. ఏండ్లు గడిచేకొద్ది.. సతాయించడం ప్రారంభించాయి. పాత ఫోన్లతో అంగన్వాడీలు తంటాలు పడుతున్నారు. ఈ ఫోన్లలో ఎంటర్ చేయడం కంటే.. రిజిస్టర్లలో రాయడమే బెటర్ గా ఉంటుండే అంటున్నారు.
పనులన్నీ.. ఫోన్లోనే
విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 2019లో సుమారు 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ప్రభుత్వం మొబైల్ ఫోన్లను పంపిణీ చేసింది. ఈ ఫోన్ల ద్వారానే హాజరు మొదలుకొని, కోడిగుడ్లు, బాలామృతం, పాల సరఫరా, గర్భిణుల ఆరోగ్య వివరాలు, చిన్నారుల ఎత్తు -బరువులు వంటి కీలక సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. పోషణ్ మాస్, ట్రాకర్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఫోన్లు ఇచ్చి ఐదేండ్లు గడుస్తుండటంతో అవి పాడైపోయాయి.
కాలం చెల్లిన గాడ్జెట్లు, తరచూ రిపేర్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల జీవిత కాలం ఐదేళ్లుగా పరిగణించి, తర్వాత కొత్తవి ఇవ్వాలి. 2019లో తెలంగాణ టెక్నాలజీస్ సర్వీసెస్ ద్వారా పంపిణీ చేసిన ఈ ఫోన్లు నాటి టెక్నాలజీకి సరిపోయినప్పటికీ.. ప్రస్తుత పోషణ్ ట్రాకర్ యాప్ అప్ డేట్‌లకు సరిపోవడం లేదు. నాడు ఇచ్చినవి 2జీబీ ర్యామ్, 16 జీబీ లేదా 32 జీబీ కెపాసిటీ కలిగిన ఫోన్లు కావడంతో.. లేటెస్ట్ అప్డేట్లకు అవి సహకరించడం లేదు.
నెట్‌వర్క్ కూడా 2జీ/3జీ స్థాయిలోనే ఉండటం, ఫోన్ల ప్రాసెసర్లు పాతబడిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా పాడైన ఫోన్లను బాగు చేయించుకోవడానికి డిపార్ట్‌మెంట్ నుంచి నయా పైసా రాకపోవడంతో.. చాలీచాలని జీతాల్లోనే అంగన్వాడీలు సొంతంగా వేల రూపాయలు ఖర్చు చేసి బ్యాటరీలు వేయించుకోవాల్సి వస్తోంది.
పనికి తగ్గ సౌలత్లు కల్పించట్లేదు
పని ఒత్తిడి పెంచుతున్న అధికారులు.. అందుకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ పనిచేయక వివరాలు అప్లోడ్ చేయకపోతే జీతాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారని, ఇది తమపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నదని యూనియన్ నేతలు వాపోతున్నారు. 14 రకాల మాన్యువల్ రిజిస్టర్ల భారాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. కాలం చెల్లిన ఫోన్లతో తమకు నరకం చూపిస్తున్నదని అంగన్వాడీలు మండిపడుతున్నారు.
కొత్త ఫోన్ల కొనుగోలు వ్యవహారం అధికారుల టేబుళ్ల మధ్యే నలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన నిధులు మంజూరయ్యాయని, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్)కు ఇప్పటికే ఇండెంట్ పెట్టామని అధికారులు చెబుతున్నారు. కానీ నెలలు గడుస్తున్నా కొత్త ఫోన్ల ఊసే లేదు. టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం అంగన్వాడీల పాలిట శాపంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి, 5జీ ఫోన్లను పంపిణీ చేయాలని, లేదంటే పాత రిజిస్టర్ల విధానాన్నే కొనసాగించేలా వెసులుబాటు కల్పించాలని అంగన్వాడీలు కోరుతున్నారు.
డిస్ప్లే పగిలి.. బ్యాటరీ ఉబ్బి
ఫోన్లు ఇచ్చి ఐదేండ్లు కావడంతో.. చాలా వరకు పనిచేయడం లేదు. దీంతో కొందరు అంగన్వాడీలు సొంతంగా ఫోన్లు కొని వివరాలను అప్డేట్ చేస్తుండగా.. ఫోన్లను కొనలేని అంగన్వాడీలు ఇంకా ఆ పాత ఫోన్లతోనే కుస్తీ పడుతున్నారు. చాలా ఫోన్లలో బ్యాటరీలు ఉబ్బిపోవడం, చార్జింగ్ గంట కూడా నిలవకపోవడం, డిస్ ప్లేలు సరిగా రాక, స్క్రీన్లు పగిలిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. రోజంతా పిల్లలను చూసుకోవాల్సిన టీచర్లు.. ఈ డొక్కు ఫోన్లలో సమాచారం అప్ లోడ్ కాక గంటల తరబడి కుస్తీ పట్టాల్సి వస్తున్నది. సర్వర్ డౌన్ సమస్యలకు తోడు, ఫోన్ల ర్యామ్ తక్కువగా ఉండటంతో యాప్ ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాంగ్ అవుతున్నదని వాపోతున్నారు.
వెంటనే 5జీ ఫోన్లు ఇవ్వాలి
ఐదేండ్ల కింద ఇచ్చిన ఫోన్లు పట్టుకొని పోషణ్ ట్రాకర్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పటికప్పుడు యాప్ అప్‌డేట్ అవుతోంది. 2జీబీ ర్యామ్ ఫోన్లు హ్యాంగ్ అవుతున్నయ్. ఫోన్లు నడవక మేము ఇబ్బందులు పడుతుంటే.. అధికారులు మాత్రం ఆన్‌లైన్ చేయకుంటే జీతాలు ఆపేస్తామని బెదిరిస్తున్నరు. ఫోన్ల రిపేర్ల ఖర్చులు భరించలేకపోతున్నం. వెంటనే హైఎండ్ ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్లు ఇవ్వాలి.
-కవిత, అంగన్‌వాడీ యూనియన్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్
