ధరణి పెట్టిన చిచ్చు..యువకుడి ఆత్మహత్యాయత్నం

ధరణి పెట్టిన చిచ్చు..యువకుడి ఆత్మహత్యాయత్నం
  • తన వాటా కూడా పెద్దనాన్న పేరిటే పట్టా చేసిన ఆఫీసర్లు
  • సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన బాధితుడు
  • పరిస్థితి విషమం.. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స

భీమదేవరపల్లి, వెలుగు: ధరణి పెట్టిన చిచ్చు ఓ యువకుడి ప్రాణాల మీదికి వచ్చింది. తన వాటాగా రావాల్సిన భూమిని అధికారులు తన పెద్ద నాన్న పేరు మీద ధరణిలో ఎక్కించడం, దాన్ని తనకు పట్టా చేసేందుకు ఆయన నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో జరిగిందీ ఘటన. బాధితుడు ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

వంగర గ్రామానికి చెందిన పొన్నాల రామయ్య, మల్లయ్య అన్నదమ్ములు. రామయ్యకు రాజిరెడ్డి, వెంకట్​రెడ్డి, మల్లయ్య అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. మల్లయ్యకు పిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడైన రాజిరెడ్డిని దత్తత తీసుకున్నాడు. వారికున్న సుమారు22 ఎకరాల భూమిలో రాజిరెడ్డికి 10 ఎకరాలు, వెంకట్​రెడ్డి, మల్లయ్య కలిపి 10 ఎకరాల చొప్పున పంచుకున్నారు. మరో 2 ఎకరాల భూమి మాత్రం 2007లో రెవెన్యూ ఆఫీసర్లు చేసిన పొరపాటు వల్ల రాజిరెడ్డి పేరుతో రికార్డుల్లోకి ఎక్కింది. రాజిరెడ్డి మరణించాక విరాసత్ ద్వారా ఆయన కొడుకు తిరుపతిరెడ్డికే పట్టా వచ్చింది. భూరికార్డుల ప్రక్షాళన టైంలో ఈ పొరపాటును సరిదిద్దాలని వెంకట్​రెడ్డి కొడుకు శ్రీనివాస్​రెడ్డి, మల్లయ్య కొడుకు చిన్న రాజిరెడ్డి కోరినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా రికార్డుల్లోకి ఎక్కించారు. 2 ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాస్​బుక్‌‌ను ఇటీవల తిరుపతిరెడ్డి పేరు మీదే జారీ చేశారు. దీంతో తమ వాటా భూమి తమకు కావాలని, తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి తమ పేరిట పట్టా చేయాలని కొంతకాలంగా తిరుపతి రెడ్డితో శ్రీనివాస్​రెడ్డి కొడుకు అజయ్, చిన్న రాజిరెడ్డి కొడుకు రాజు గొడవ పడుతున్నారు. ఆరు నెలల క్రితం రాజు ఆత్మహత్యకు యత్నించడంతో ఆయన పేరుతో 23 గుంటలు పట్టా చేసేందుకు గురువారం పెద్దమనుషులు స్లాట్​బుక్​చేశారు. దీంతో విషయం తెలుసుకున్న అజయ్ కూడా గురువారం తిరుపతిరెడ్డి ఇంటి ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి అజయ్‌‌ని వరంగల్‌‌లోని ఎంజీఎం హాస్పిటల్‌‌కు తరలించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలిసింది.