బెట్టింగ్​లో డబ్బులు పోతే.. బీర్​సీసాతో తల పగలగొట్టుకుని..దోపిడీ కథ చెప్పిండు!

బెట్టింగ్​లో డబ్బులు పోతే.. బీర్​సీసాతో తల పగలగొట్టుకుని..దోపిడీ కథ చెప్పిండు!
  • విచారణలో అసలు  విషయం బయటపెట్టిన రికవరీ ఏజెంట్

కాగజ్ నగర్, వెలుగు : ఆన్​లైన్ బెట్టింగ్​కు అలవాటు పడ్డ ఓ యువకుడు నిండా మునిగాడు. లోన్ రికవరీ ఏజెంట్ గా పని చేస్తూ కస్టమర్ల డబ్బులను కూడా పెట్టాడు. అవి కూడా పోవడంతో ఏం చేయాలో  తోచలేదు. దీంతో బీర్​సీసాతో తల పగలగొట్టుకుని దారి దోపిడీ కథ చెప్పాడు. పోలీసులకు అతడిని హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. అతడు చెప్పింది నమ్మశక్యంగా అనిపించకపోవడంతో తమ స్టైల్​లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు కథనం ప్రకారం..మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఖర్జీ భీంపూర్ కు చెందిన ప్రమోద్ సింగ్ కాగజ్ నగర్ లోని శ్రీరామ్ ఫైనాన్స్ లో రికవరీ ఏజెంట్​గా పని చేస్తున్నాడు.

సోమవారం ఈస్గాంలో లోన్​డబ్బులు కలెక్ట్ చేసుకుని కాగజ్‌నగర్‌కు వస్తుండగా శివమల్లన్న ఆలయ సమీపంలో ముగ్గురు వ్యక్తులు వెనుక నుంచి తనపై దాడిచేసి రూ.33 వేలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి తీరుపై అనుమానం వచ్చి గట్టిగా అడిగారు. దీంతో తాను గతంలో క్రికెట్ బెట్టింగ్ పెట్టి రూ.2లక్షల 60 వేలు పోగొట్టుకున్నానని, మళ్లీ ఈనెల 20న కస్టమర్ల డబ్బులు రావడంతో బెట్టింగ్ పెట్టానని చెప్పాడు.

అవి కూడా పోవడంతో ఫై‌నాన్స్ కంపెనీకి వెళ్తే డబ్బులు అడుగుతారని తనకు తానే గాయం చేసుకొని దోపిడీ కథ అల్లినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రమోద్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించాడు.