కట్నం తీసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాదైనా..

కట్నం తీసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాదైనా..
  • పెళ్లికి అంగీకరించని యువకుడి ఇంటి ముందు యువతి నిరాహార దీక్ష

ఖమ్మం: పెళ్లి చేసుకుంటానని 6 లక్షల కట్నంగా తీసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుని.. ఏడాది కావస్తున్నా పెళ్లికి అంగీకరించకపోవడంతో.. సదరు యువకుడు ఇంటి ముందు యువతి నిరాహార దీక్షకు కూర్చుంది. పెళ్లి చేసుకునే వరకు దీక్ష విరమించేది లేదంటూ బాధితురాలు చెబుతున్న ఘటన ఖమ్మం జిల్లా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అమరనేని పరమేశ్వర్ అనే యువకుడికి గత ఏడాది  కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచినేని పాలెంకు చెందిన కమలతో నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థ సమయంలో కట్నకానుకలుగా యువకుడికి ఆరు లక్షల రూపాయల నగదు, కొంత బంగారం అమ్మాయి తల్లిదండ్రులు అప్పజెప్పారు.

ఈ ఏడాది మే 30న వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ లాక్ డౌన్ రావడంతో  పెళ్లి  ఆగిపోయింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్నా ఎలాంటి మాటలు లేవు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి తెలిపాడు. కారణం చెప్పమని ఎన్నిసార్లు నిలదీసి అడిగినా ఇదే చెబుతున్నాడంటూ బాధితురాలు కమల కంట తడిపెట్టుకుంది. చేసేదేమీలేక ఈరోజు తన బంధువులతో కలిసి మధిరలో యువకుడి ఇంటిముందు నిరాహార దీక్ష చేపట్టింది. తనను పెళ్ల చేసుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని.. తనకు మరో దారి లేదని కమల ఆవేదన వ్యక్తం చేసింది.