బీఆర్ఎస్ హయాంలో శానిటరీ ప్యాడ్ల పైసలూ వదల్లే: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీఆర్ఎస్ హయాంలో శానిటరీ ప్యాడ్ల పైసలూ వదల్లే: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • బీడీ కార్మికుల పింఛన్ల నిధులు కూడా స్వాహా 

కామారెడ్డిటౌన్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీడీ కార్మికుల పింఛన్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల కోసం కేటాయించిన శానిటరీ ప్యాడ్ల నిధుల్లో కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017–18 సంవత్సరంలో బీడీ కార్మికుల పింఛన్లకు రూ.430 కోట్లు కేటాయిస్తే, అందులో రూ.45.28 కోట్లు స్వాహా చేశారని అన్నారు. అలాగే 2019–20లో రూ.803 కోట్లలో రూ.84.30 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. 

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినుల కోసం శానిటరీ ప్యాడ్ కిట్లకు కేటాయించిన రూ.44 కోట్లలో రూ.40.20 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాలికల బాత్‌‌‌‌రూంల నిర్మాణానికి కేటాయించిన నిధులు కూడా వదల్లేదన్నారు. మొత్తం స్కీమ్స్‌‌‌‌లో రూ.2 వేల కోట్ల వరకు దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమని, తప్పని నిరూపిస్తే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 

కులగణనలో పందులు, గాడిదల లెక్కలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ మనుషుల జనాభా లెక్కలు చెప్పలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులను నిధుల దుర్వినియోగంపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హరిశంకర్​గౌడ్​, ఆకుల హన్మాండ్లు, తాహేర్, సంతోషి, వేణు తదితరులు పాల్గొన్నారు.