ఆధార్ కార్డు జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణతో పాటుగా 16 రాష్ట్రాలలో ఈ విధానం అమలవుతుండగా, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఉడాయ్) చర్యలను ప్రారంభించింది. ఉడాయ్ దీనికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది.
ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్‌కార్డు తీసుకున్నప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ను నమోదు చేయడం లేదు. దీంతో వారి తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1000 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఆధార్ నంబర్ ఆధారంగానే నిర్ణయిస్తున్నారు. ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్ కార్డులు జారీ కాగా, వాటిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు 20 కోట్ల మంది ఉన్నారు.
