ఈసీ అంటే.. ఎంటైర్ లీ కాంప్రమైజ్డ్: ఎన్నికల సంఘంపై ఆధిత్య ఠాక్రే ఫైర్

ఈసీ అంటే.. ఎంటైర్ లీ కాంప్రమైజ్డ్: ఎన్నికల సంఘంపై ఆధిత్య ఠాక్రే ఫైర్

అజిత్ పవార్ వర్గాన్ని 'నిజమైన ఎన్‌సిపి'గా ప్రకటించడం ద్వారా భారత ఎన్నికల సంఘం మోసపూరితమైనదిగా రుజువైందని.. పూర్తిగా రాజీపడిందని మాజీ మంత్రి, శివసేన(యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో నెలకొన్న వివాదాన్ని పిటిషనర్ అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం మంగళవారం తీర్పునిచ్చింది.  అజిత్ సారథ్యంలోని ఎన్సీపీనే అసలైన పార్టీగా ఈసీ ప్రకటించింది. పార్టీ పేరు, గుర్తు అజిత్ వర్గానికే కేటాయించింది. దీంతో నిధులు, బ్యాంక్ అకౌంట్లపై నియంత్రణ.. అజిత్ వర్గానికే దక్కనుంది.

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఆధిత్య ఠాక్రే తప్పుబట్టారు..ఈసీ నిర్ణయంపై ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. "ఎన్‌సిపి పార్టీ వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది. ఎన్నికల కమీషన్ స్వయంగా దొంగతనాన్ని చట్టబద్ధం చేయడం ప్రారంభించినప్పుడు.. ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని మీకు తెలుసు. ఎన్నికల సంఘం..మోసపూరితమైనదని ఇప్పుడు మరోసారి రుజువు చేసింది. మనది స్వేచ్ఛా, న్యాయమైన ప్రజాస్వామ్యం కాదని అందరికీ చూపిస్తున్నారు" అని విమర్శించారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 12 మంది శరద్ వర్గానికి, 41 మంది అజిత్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని ఆధారంగా చేసుకుని అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఈసీ నిర్ణయాన్ని వెలువరించింది. లోక్‌‌‌‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో శరద్ వర్గానికి గట్టి దెబ్బ తగిలినట్టయింది. గతేడాది జులైలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ ఎన్సీపీని వీడారు.