
గుజరాత్‌లో టాటా-ఎయిర్‌బస్ సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్ట్ పొరుగు రాష్ట్రానికి ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రగతిపై షిండే ప్రభుత్వం సీరియస్‌గా లేదన్న ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో తొలిసారిగా ప్రైవేట్ కంపెనీలు మిలిటరీ ప్లేన్ ల నిర్మాణం చేపట్టనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో టాటా కంపెనీ, ఎయిర్ బస్ (యూరోపియన్ కంపెనీ) కలిసి ఎయిర్ ఫోర్స్ కోసం రవాణా విమానాలను తయారు చేయనున్నాయి. వడోదరలో రూ. 21,935 కోట్లతో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టుకు ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారని డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ విమానాలను పౌర అవసరాలకు కూడా వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.