దేశం కోసం100 సార్లైనా జైలుకు వెళ్తా, భగత్ సింగ్ ఫాలోవర్ని: కేజ్రీవాల్

దేశం కోసం100 సార్లైనా జైలుకు వెళ్తా, భగత్ సింగ్ ఫాలోవర్ని: కేజ్రీవాల్

చండీగఢ్: దేశాన్ని కాపాడేందుకు తాను 100 సార్లయినా జైలుకు వెళ్లేందుకు రెడీ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌ ఫాలోవర్నని వెల్లడించారు. గురువారం ఆయన పీటీఐతో మాట్లాడారు. " నేను భగత్ సింగ్ అనుచరుడిని. దేశాన్ని కాపాడేందుకు 100 సార్లు జైలుకు వెళ్లవలసి వస్తే తప్పకుండా వెళ్తాను. నేను అవినీతికి పాల్పడ్డానని బీజేపీ అంటున్నది. రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డానని..500 చోట్ల తనిఖీలు చేశారు. ఒక్క పైసా కూడా రికవరీ కాలేదు.100 కోట్లు నా దగ్గర ఉంటే గాలిలోనే మాయమైపోయాయా? ఒక్క రుజువు కూడా లేకుండా అరెస్ట్ చేశారు.

కేజ్రీవాల్ అవినీతిపరుడైతే, ఇక ఈ ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదని ప్రజలే అంటున్నారు. నేను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలులేవని దేశం ముందు ప్రధాని మోదీనే అంగీకరించారు. అంటే నాపై ఫేక్  కేసు పెట్టారనేగా అర్థం" అని కేజ్రీవాల్ వివరించారు. మోదీ చేయలేని అభివృద్ధిని తాను చేసిచూపించానని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే తనపై ఫేక్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ‘నియంతృత్వానికి, గూండాయిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే నన్ను సైలెంట్ చేయాలని, నా గొంతును అణచివేయాలని చూస్తున్నారు. కానీ ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు. జూన్ 2 న మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నా దేశాన్ని కాపాడటానికి జైలుకు వెళ్తున్నందుకు గర్వపడుతున్నాను" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

కేజ్రీవాల్ పిటిషన్లను వ్యతిరేకించిన ఈడీ

లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే.. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. ఆయన అభ్యర్థనలను ఈడీ వ్యతిరేకించింది. అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి 67 రోడ్‌షోలు, 30 ఇంటర్వ్యూలు ఇచ్చారని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు.. బెయిల్ విషయంలో ఈ శనివారంకల్లా స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది.