రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

రాజ్యసభలో  కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 20కి చేరింది. అయితే సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. విపక్షాల గొంతును ప్రభుత్వం అణిచివేస్తోందని..వెంటనే సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో కూడా విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపుపై చర్చ జరపాలని ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సభను 2గంటలకు వాయిదా వేశారు. 

19మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

సభా కార్యకలాపాలను అదేపనిగా అడ్డుకున్నందుకు విపక్షాలకు చెందిన19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ విధించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 18 నుంచి విపక్షాల ఎంపీలు.. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విపక్ష ఎంపీల నిరసనలతో డిప్యూటీ చైర్మన్ సభను పలుమార్లు వాయిదా వేశారు. అయినా ఎంపీలు వినక వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలపడంతో వారిపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రెజరీ బెంచ్​ను ఆదేశించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్​ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనుచిత ప్రవర్తన, సభాధిపతి పట్ల ఏమాత్రం గౌరవం చూపనందుకు పది మంది ఎంపీలు ఈ వారమంతా హౌస్​కు హాజరు కాకుండా వారిపై సస్పెన్షన్​ విధిస్తున్నామని డిప్యూటీ చైర్మన్​ తెలిపారు.