ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం

ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన  మనీలాండరింగ్‌ కేసులో  ఆరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు సీఎం అరవింద్  కేజ్రీవాల్.  అయితే కొద్దిరోజులుగా  ఆయన ఆరోగ్యం  క్షీణించినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి.  డయాబెటిక్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ షుగర్‌ లెవల్స్‌ దారుణంగా పడిపోయాయని ఆప్ వర్గాలు అంటున్నాయి.  కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఒకానొక సమయంలో 46 ఎంజికి పడిపోయిందని  ఇలా తగ్గడం చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు.  

అంతకుముందు రోజు కేజ్రీవాల్ సతీమణి సునీతా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈడీ  కస్టడీలో కేజ్రీవాల్ ను తాను కలిశానని, ఆయన  షుగర్ లెవెల్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు చెప్పారని సునీతా అన్నారు . కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం భగవంతున్ని ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

కాగా మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ 2024 మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ తన అరెస్టును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.