కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చరణ్జిత్ చన్నీని ఓడించి సంచలనం సృష్టించారు ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్. కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం స్వీపర్ ఉద్యోగం వదులుకునేందుకు నిరాకరించారు. గవర్నమెంట్ స్కూల్ లో కాంట్రాక్ట్ స్వీపర్గా పని చేస్తున్న  ఆమె.. ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు డ్యూటీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో లాభ్ సింగ్ 37,558 ఓట్ల భారీ తేడాతో మాజీ సీఎం చన్నీని ఓడించారు. అయినా ఆమె స్వీపర్ ఉద్యోగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బల్దేవ్ కౌర్.. "నా కొడుకు గెలిచిన తర్వాత నేను పనికి రానని అంతా అనుకున్నారు. కానీ నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు కానీ నేను కాదు కదా. నేను నా ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలి" అని ప్రశ్నించారు.

బల్దేవ్ కౌర్ గత 22 ఏళ్లుగా బర్నాలా జిల్లాలోని ఉగోకే గ్రామ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో కొడుకు విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. చీపురుకు తన జీవితంలో కీలక పాత్ర ఉందని చెప్పారు. తన కొడుకు ప్రత్యర్థిగా సీఎం చన్నీ ఉన్నప్పటికీ లాభ్ సింగ్ తప్పక గెలుస్తాడన్న నమ్మకం తనకుండేదని అన్నారు.