నేను చాలా పెద్ద తప్పు చేసాను..కోహ్లీ గురించి నాకు తెలియదు: డివిలియర్స్

నేను చాలా పెద్ద తప్పు చేసాను..కోహ్లీ గురించి నాకు తెలియదు: డివిలియర్స్

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ఎందుకు తప్పుకున్నాడో ఎవరికీ తెలియదు. వ్యక్తిగత కారణాల వలన తప్పుకున్నా.. అసలు విషయం ఏంటనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కోహ్లీ గురించి కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నట్లు.. తాను కుటుంబంతో సమయం గడుపుతున్నారని.. అందువల్లే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌‌లకు అతను దూరమైనట్లు ఏబీ వెల్లడించారు.

ఆపై కొద్దిసేపటికే కోహ్లీ- అనుష్క శర్మ జంట రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మధురక్షణాలు ప్రతి కుటుంబానికి చాలా ముఖ్యమైనవని.. ఈ సమయంలో కోహ్లీ కుటుంబంతో గడపడం సరైన నిర్ణయమని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించారు. దీంతో విరాట్ కోహ్లీ అత్యంత సన్నిహితుడు డివిలియర్స్ ఈ విషయం చెప్పేసరికి అందరూ నిజమని నమ్మేశారు. ఇదిలా ఉండగా తాజాగా కోహ్లీ విషయంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని డివిలియర్స్ అన్నారు. 

డివిలియర్స్ తన యూ ట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ..నేను చాలా పెద్ద తప్పు చేశాను. కోహ్లీ గురించి తప్పుడు సమాచారాన్ని అందించాను. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అని డివిలియర్స్ అన్నారు. నేను చేయగలిగేది కోహ్లీకి శుభాకాంక్షలు మాత్రమే  చెప్పడం. ప్రపంచం మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలియజేయాలి. విరామానికి కారణం ఏమైనప్పటికీ..అతను బలంగా, ఆరోగ్యంగా  తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. అని ఈ మాజీ దక్షిణాఫ్రికా కెప్టెన్ వెల్లడించాడు. 

తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ.. చివరి మూడు టెస్టులు ఆడతాడా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ ప్రారంభమవుతుంది. చివరి మూడు టెస్టులకు జట్టును ఈ రోజు సెలక్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కోహ్లీ మూడు, నాలుగు టెస్టుల్లో అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, ఆఫ్ఘనిస్తాన్ పై రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.