ఒక కంటితోనే క్రికెట్ ఆడిన డివిలియర్స్..రిటైర్మెంట్ వెనుక అసలు మిస్టరీ ఇదే

ఒక కంటితోనే క్రికెట్ ఆడిన డివిలియర్స్..రిటైర్మెంట్ వెనుక అసలు మిస్టరీ ఇదే

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్,మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్ లో టాప్ లో ఉన్న ఉన్న ఈ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 ఏళ్ళకే క్రికెట్ గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరించింది. ఫ్యామిలీతో గడపడానికే ఈ నిర్ణయం తీసుకుంటానని చెప్పిన డివిలియర్స్ తాజాగా తన రిటైర్మెంట్ వెనుక ఉన్న షాకింగ్ విషయాలు వెల్లడించాడు. రెండు సంవత్సరాల పాటు తాను ఒక కంటితోనే బ్యాటింగ్ చేసినట్టు తెలిపాడు. 

డివిలియర్స్ మే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆ తర్వాత రెండేళ్లు తన క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ తరపున ఆడిన ఏబీ..బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత డివిలియర్స్ రెండేళ్లు తన ఎడమ కన్నుతోనే ఆడాడట. విస్డెన్ క్రికెట్ మంత్లీలో మెలిండా ఫారెల్‌తో తన రిటైర్మెంట్ గురించి అసలు విషయం చెప్పాడు. 

"మా యువకుడు పొరపాటున తన మడమతో నా కంటిపై తన్నాడు. నాకు కుడి కంటి చూపు బాగా తగ్గిపోయింది. నాకు శస్త్ర చికిత్స చేసినప్పుడు డాక్టర్ మీరు ఒక్క కంటి చూపుతో ఎలా క్రికెట్ ఎలా ఆడారు?' అన్నాడు. అదృష్టవశాత్తూ నా కెరీర్‌లో చివరి రెండేళ్లుగా నా ఎడమ కన్ను మంచి పని చేసింది." అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోకపోవడానికి కోవిడ్ కూడా ఒక కారణమని.. 2015 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి ఎంతగానో బాధించిందని తన మనసులో మాట బయట పెట్టాడు. 

2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.