
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లోని బ్రిలియంట్ కాలేజీలో భారీ చోరీ జరిగింది. గురువారం కాలేజీకి తాళం వేసి స్టాఫ్ వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 8:45 గంటలకు కాలేజీ ఏవో కేశినేని కుమార్ వచ్చి చూసే సరికి గేటు తాళాలు, ఆఫీసులో డోర్లు పగలగొట్టి ఉన్నాయి.
బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ వీరన్నకు సమాచారం ఇచ్చాడు. ఆయన వచ్చి చూసేసరికి బీరువాలో దాచిన రూ.కోటి 7 లక్షలు చోరీకి గురయ్యాయి. మూడు క్యాంపస్‌లకు సంబంధించిన డబ్బు ఒకే చోట భద్రపరిచారు. లవాదేవీలు చూసే వ్యక్తి మూడు రోజులు పాటు సెలవులో ఉన్నారు.
దొంగతనం చేసిన దుండగులు దాదాపు 100 సీసీ కెమెరాలకు సంబధించిన హార్డ్‌డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి పరిశీలించారు. దాదాపు 200 కెమెరాలతో గట్టి నిఘా ఉండే ఈ కాలేజీలో చోరీ జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఆఫీసులో నాలుగు బీరువాలు ఉండగా డబ్బులు దాచిన బీరువానే పగులగొట్టి చోరీ చేయడం చూస్తుంటే ఇంటి దొంగల పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 15 టీంలను ఏర్పాటు చేశారు.