రెండు, మూడ్రోజుల్లో అభయహస్తం నిధులు వాపస్

రెండు, మూడ్రోజుల్లో అభయహస్తం నిధులు వాపస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్వాక్రా మ‌హిళ‌లు పొదుపు చేసుకున్న అభ‌య హ‌స్తం నిధుల‌ను వాళ్లకు తిరిగి ఇవ్వాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ‌ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిలు ఆయా శాఖ‌ల కార్యద‌ర్శులు, ఇత‌ర అధికారుల‌తో అసెంబ్లీలో స‌మీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు రూ.545 కోట్లను పొదుపు చేసుకున్నారు. అభయ హస్తం స్కీమ్ ను రద్దు చేయడంతో డబ్బులు తమవి తమకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, మంత్రులను మహిళలు నిలదీస్తున్నారు. దీంతో ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడ్రోజుల్లోనే ఆ డబ్బులను ఆయా మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ చేయాల‌ని నిర్ణయించారు. ఈ మేర‌కు అధికారులు వెంట‌నే చ‌ర్యలు తీసుకోవాల‌ని మంత్రులు ఆదేశించారు.