
డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా టాలెంటెడ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. టీమిండియా తరుఫున టెస్ట్ క్రికెట్లో అరంగ్రేటం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ బెంగాల్ బ్యాటర్‌కు మరోసారి నిరీక్షణ తప్పలేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు భారత స్క్వాడ్ లో చోటు దక్కింది. కానీ ఒక్క టెస్టులో కూడా ఆడే అవకాశం రాలేదు. గురువారం (జూలై 31) ఓవల్ వేదికగా ప్రారంభమైన చివరి టెస్ట్ ప్లేయింగ్ లెవన్‌లో ఈశ్వరన్‌కు స్థానం దక్కలేదు. కరుణ్ నాయర్ కు అవకాశమిచ్చిన ఈశ్వరన్ కు ఛాన్స్ దక్కలేదు.
ఈశ్వరన్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కకపోవడంతో అతని తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐతో పాటు సెలెక్టర్లపై బహిరంగంగా తన నిరాశను వ్యక్తం చేశారు. రంగనాథన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు ఎన్ని రోజులు అవకాశం కోసం ఎదురుచూడాలి అని ప్రశ్నించాడు. " నేను రోజులను లెక్కించడం లేదు. నేను సంవత్సరాలను లెక్కిస్తున్నాను. ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయ్యింది. దులీప్ ట్రోఫీ లేదా ఇరానీ ట్రోఫీకి కరుణ్ ఎంపిక కాలేదు. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు అభిమన్యు 864 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్ధం కావట్లేదు". అని తన విచారం వ్యక్తం చేశాడు.
29 ఏళ్ల ఈశ్వరన్ 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ అతడికకి ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా టీమిండియాకు ఎంపిక అయ్యాడు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. ఒక్క మ్యాచులో కూడా ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ అయినా ఒక్క టెస్టులోనూ ఛాన్స్ రాలేదు.
గత ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు అసాధారణంగా రాణించాడు. ముఖ్యంగా ఇరానీ ట్రోఫీలో 191 పరుగుల భారీ స్కోర్ చేసి అదరగొట్టాడు.ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 19 పరుగులు చేసి విఫలమయ్యాడు. అయితే రెండో టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 68.. రెండో ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి రాణించాడు.