మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్: ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ మిస్సింగ్.!

మొయినాబాద్ డ్రగ్స్  కేసులో బిగ్ ట్విస్ట్: ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ మిస్సింగ్.!

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో  కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన  నిందితుడిగా భావిస్తున్న అభిషేక్ సింగ్ అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఇప్పుడు అతను కనిపించకుండా పోవడంతో కేసు మరింత చిక్కుముడిగా మారింది.  మార్చి 16వ తేదీ నుంచి తన కుమారుడు అభిషేక్ సింగ్ కనిపించడం లేదంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతాననే భయంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

గత ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం అభిషేక్ మాత్రమే కాకుండా, రాజేష్ వర్మ అనే మరో వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ దందాలో భాగస్వామిగా ఉన్నట్లు తేలింది.

పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా గత ఏడాది కాలంగా డ్రగ్స్ చేరవేస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ శరత్ ద్వారా సాగుతున్న ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టును పోలీసులు ఇప్పటికే రట్టు చేశారు. ఇప్పుడు ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ అదృశ్యం కావడంతో ఈ కేసులో అసలు సూత్రధారులెవరు? డ్రగ్స్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరివి? అనే ఉత్కంఠ నెలకొంది.