
- హిమాచల్, ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు
- పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం
- ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు
- లోతట్టు ప్రాంతాలు మునక
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్‌కు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. జులై 2 నుంచి 5 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వర్షాలతో జార్ఖండ్ ఆగమాగం అవుతోంది. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాలిలోతు వరద నీరు చేరింది. జంషెడ్‌పూర్‌లోని ఈస్ట్ సింగ్భూమ్ ప్రాంతంలో ఖార్ ఖాయ్, సుబర్ నరేఖా నదులు డేంజర్ లెవెల్స్ దాటి ప్రవహిస్తున్నాయి.
ఆదిత్యపూర్ బ్రిడ్జి వద్ద ఖార్ ఖాయ్ నది 130.65 మీటర్లకు చేరింది. అలాగే సుబర్ నరేఖా నది 121.60 మీటర్లకు చేరింది. ఈస్ట్ సింగ్ భూమ్ లోని బహరాగోరాలో పలు ఇండ్లు నీట మునిగాయి. జేఎంఎం ప్రతినిధి, బహరాగోరా మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగి సోమవారం బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి వారికి నిత్యావసరాలు, టార్పాలిన్, ప్లాస్టిక్ షీట్లు పంపిణీ చేశారు. బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆయన కోరారు.
ఈస్ట్ సింగ్ భూమ్లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈస్ట్ సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ కర్ణ్ సత్యార్థి సూచించారు. వరదలు తలెత్తే పరిస్థితి ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని స్థానికులను ఆయన హెచ్చరించారు. సహాయం కోసం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
ఉక్కపోత నుంచి ఢిల్లీకి ఊరట
నైరుతి రుతుపవనాలు ఆదివారం ఢిల్లీలో ప్రవేశించడంతో వాతావరణం చల్లబడింది. ఇన్ని రోజులు తీవ్రంగా ఉక్కపోతకు గురైన ఢిల్లీ వాసులకు కొంత రిలీఫ్ కలిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి.
హిమాచల్‌లో పేకమేడలా కూలిన ఐదంతస్తుల భవనం
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఓ భవనం పేకమేడలా కూలిపోయింది. అందులో నివసిస్తున్న వారందరూ ఖాళీ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాలు, కొండచరియల ధాటికి భవనం కూలిపోయింది. అయితే, తమ భవనానికి సమీపంలో నాలుగు లేన్ల రోడ్డు వేస్తున్నారని, ఆ నిర్మాణం ప్రభావం వల్ల బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయని భవనం ఓనర్ చెప్పాడు. కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని ఓనర్ పేర్కొన్నాడు.