డాక్టర్​ లేక డెలివరీ చేసిన నర్సులు కడుపులోనే శిశువు కన్నుమూత

డాక్టర్​ లేక డెలివరీ చేసిన నర్సులు కడుపులోనే శిశువు కన్నుమూత
  •     ఆక్సిజన్ ​అందకనే మృతి
     
  •     సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ కుటుంబసభ్యుల ఆందోళన

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానలో డాక్టర్​ లేకపోవడంతో నర్సులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నం చేయగా కడుపులోనే శిశువు కన్నుమూసింది. రామాయంపేట మండలం కోనాపూర్​కు చెందిన నవనీతకు పురిటి నొప్పులు రావడంతో శనివారం దుబ్బాక దవాఖానకు తీసుకువచ్చారు. డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ నర్సులు నవనీతను చూశారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. ఆ క్రమంలో కడుపులో బిడ్డకు ఆక్సిజన్​ అందక చనిపోయింది. దీంతో నవనీత కుటుంబీకులు నర్సులను ప్రశ్నిస్తే డాక్టర్లు లేకపోయినా తల్లికి ఏమీ కాకూడదని డెలివరీకి ప్రయత్నిస్తే తమను ప్రశ్నించడం ఏమిటన్నారు. డెలీవరీ కోసం పది గంటల పాటు వేచి ఉండేలా చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నర్సుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని, కొద్ది సేపు దవాఖాన ఎదటు ఆందోళన చేశారు.