- టీజీసీహెచ్ఈ చైర్మన్కు ఏబీవీపీ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సర్కారు కన్ను పడిందని, అభివృద్ధి పేరుతో వాటిని కాజేయాలని చూస్తున్నదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీల నిధుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డిని ఏబీవీపీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు.
యూనివర్సిటీల్లో ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లు ప్రభుత్వం ఇచ్చిన నిధులు కావని, అవి విద్యార్థులు వివిధ రకాల ఫీజుల రూపంలో కట్టిన సొమ్ము అని స్పష్టం చేశారు. వర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సింది పోయి.. విద్యార్థుల ఫీజుల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఎఫ్‌డీలనే వాడుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సిటీ సెక్రటరీ పృధ్వీ,రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.
