స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడొద్దు

స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడొద్దు
  • స్కాలర్​షిప్​, రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలి 
  • ఏబీవీపీ డిమాండ్​

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం  స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏబీవీపీ సికింద్రాబాద్‌ జిల్లా కన్వీనర్​ చెర్క బాలు అన్నారు. సోమవారం మారేడ్​పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్​ కాలేజీ గేట్​ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేల్లు పూర్తయినా స్కాలర్​షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. దీంతో ప్రైవేట్‌ కాలేజీలు మూతపడుతున్నాయని, విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాండురంగా, కృష్ణ, వెంకట్‌, రామ్‌, శ్రీరామ్‌, రిషి, వినోద్‌, పవన్‌ పాల్గొన్నారు.

కూకట్​పల్లిలో రాస్తారోకో..

కూకట్​పల్లి: స్కాలర్​షిప్, రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలంటూ ఏబీవీపీ మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా కన్వీనర్​ భరత్​ ఆధ్వర్యంలో సోమవారం కూకట్​పల్లిలో రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్​కు తరలించారు.