బషీర్బాగ్, వెలుగు: నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. సుమారు 300 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను ఎన్‌రోల్‌మెంట్ చేయకుండా వారి భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతున్నదని ఆరోపించారు. అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి, సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే 300 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బాధ్యులైన కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకుని, విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లు జారీ చేసి పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
