ఏబీవీపీ ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో పాదయాత్ర

ఏబీవీపీ ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో పాదయాత్ర

హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన అంతమైన సెప్టెంబర్ 17న ఏబీవీపీ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన విశిష్టతను నేటి యువతకు వివరించేందుకు పాదయాత్ర చేపడుతున్నామని చెప్పారు. 

వరంగల్, పాలమూరు, నిర్మల్, మెదక్ జిల్లాల్లో పాదయాత్రలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై సహకారం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా విమోచన దినోత్సవాన్ని జరపకుండా దాటవేశారని అన్నారు. అలాంటిది ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న జాతీయ సమైక్యతా కార్యక్రమంలో రజాకర్ల ఆకృత్యాలు, ఆనాటి వీరుల గాధలు ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న అన్ని విద్యాసంస్థలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రవీణ్ రెడ్డి కోరారు.