తెలంగాణలో ఏసీబీ మరోసారి ఉక్కుపాదం మోపింది. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో... ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మల్లారెడ్డి అల్వాల్‌లోని నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్‌లలో మల్లారెడ్డి కూడబెట్టిన భారీ ఆస్తులను అధికారులు గుర్తించారు.
ఈ సోదాల్లో 4 లగ్జరీ ఇళ్లు, ఒక కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో పాటు ఏకంగా 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది. వీటితో పాటు అల్వాల్‌లోని ఆయన ఇంట్లోనే 3 లక్షల31 వేల నగదును, 50 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్లను అధికారులు సీజ్ చేశారు.
►ALSO READ | సినిమా స్టైల్‌లో ప్లాన్ చేశాడు.. పాతబస్తీలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి.. రూ 17 లక్షలతో డ్రైవర్ జంప్
అంతేకాదు... మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దొరికిన డాక్యుమెంట్ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 3 కోట్ల రూపాయలు ఉండగా... బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదుల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని... తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి కేసులో అరెస్టయిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని రేపు రిమాండ్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.
