
ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ, ఎక్సైజ్ ఎస్సై అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: అడిగిన డబ్బులు ఇస్తే కేసులు పెట్టబోమని కల్లు వ్యాపారులను బెదిరిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్లు ఆఫీసర్లను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకట్‍రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై స్రవంతి కొద్ది రోజుల క్రితం నగరంలోని కల్లు వ్యాపారి పులి రాజాగౌడ్ కల్లు దుకాణం నుంచి కల్లు శాంపిళ్లు సేకరించారు.
వాటిని ల్యాబ్‍కు పంపాల్సి ఉన్నప్పటికీ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేస్తూ శాంపిళ్లను ల్యాబ్ పంపలేదు. ఈ లోపు కల్లు వ్యాపారి రాజాగౌడ్ తో బేరమాడారు. రూ.40 వేలు ఇస్తే కల్లు శాంపిళ్లను పరీక్షల కోసం పంపకుండా కేసును ఇక్కడితో క్లోజ్ చేస్తామన్నారు. ఆ వ్యాపారి రూ.30 వేలకు బేరమాడి దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసన్న కుమారి టీమ్ బుధవారం ఎక్సైజ్ ఎస్పీ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించి ఈ వ్యవహారంపై ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు.